నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సోలార్ బ్యాటరీలతో రినివబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు జిల్లాలోని ఐటిపాముల గ్రామానికి చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో రాష్ట్రంలోని మొదటిసారి పైలెట్ పద్ధతిన ప్రారంభించారు.
ఇందిరా మహిళా స్వశక్తి కింద ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.లక్ష విలువ చేసే సోలార్ బ్యాటరీల ఏర్పాటుకు 50 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు దీనికోసం ప్రత్యేకించి పనిచేయాల్సిన అవసరం లేదని, వారి పని వారు చేసుకుంటూనే నెలకు అదనంగా ఆదాయం పొందవచ్చు అని తెలిపారు. భూమిలేని నిరుపేదలు కుటుంబాలకు తోడుగా ఉండేందుకు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల ఆదాయం వచ్చే విధంగా స్వబ్యాగ్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్ పీఎల్ క్రికెట్ మ్యాచ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రతీక్ రెడ్డి మృతి చెందడం బాధాకరం..
చిట్యాల, వెలుగు : కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిట్యాలలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రతీక్‌రెడ్డి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.