కేసీఆర్​కు మళ్లీ అధికారంలోకి  వస్తామనే నమ్మకం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కేసీఆర్​కు మళ్లీ అధికారంలోకి  వస్తామనే నమ్మకం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి ఎందుకు రావట్లే?: మంత్రి వెంకట్​రెడ్డి
  • కేటీఆర్, హరీశ్​రావుకు హుందాతనం లేదు
  • బీఆర్ఎస్​ చెప్తున్న సర్పంచ్ పెండింగ్ బిల్లుల లెక్కలు తప్పు
  • కేబినెట్ విస్తరణలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​కు మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం  లేదని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, అప్పుడే ఏ విషయం అడిగినా మంత్రిగా తాను ఆన్సర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్ లో వెంకట్​రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

తమకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారని, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి కేసీఆర్​ ఎందుకు రావడం లేదని  ప్రశ్నించారు. కేసీఆర్​ కొడుకు, బిడ్డ, అల్లుడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో పరపతిలేని కేటీఆర్, హరీశ్​ గురించి మాట్లాడొద్దని సీఎం కు తాను  సూచించానని,  అందుకే పాలమూరు, నల్గొండ లో వారి గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు.  పబ్లిక్ లో వీళ్లిద్దరూ జోకర్లు గా మారారని అన్నారు.

 సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల విషయంలో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన లెక్కలు తప్పని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎవరెన్ని రోజులు నిర్వహించారన్నది రికార్డ్స్ లో ఉంటుందని, పదేండ్లలో బీఆర్ఎస్ ఎన్ని రోజులు నిర్వహించింది?  ఏడాది లో తాము  ఎన్ని సార్లు నిర్వహించామన్నది అందరికి తెలుసన్నారు.  స్పీకర్ ను అగౌరవపరిచే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఏసీలో మాట్లాడడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.  ప్రతిపక్ష హోదా లేకున్నా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు అధిర్​ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గే అటెండ్ అయ్యారని గుర్తు చేశారు. 

రాజకీయాల్లో హుందాతనం ఉండాలి

రాజకీయాల్లో హుందాతనం అవసరమని, కేటీఆర్, హరీశ్​ కు అది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ లో భాగంగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయని తెలిపారు. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందని మంత్రి పేర్కొన్నారు.  సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ అనేది.. ఎప్పుడు, ఎవరికి పదవులు అనేది ఎవరూ చెప్పలేమని, ఈ విషయంలో పార్టీ హైకమాండ్,  సీఎందే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

 పాలమూరు నుంచి వాకాటి శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, ఇది మాత్రం తాను చెప్పగలనని అన్నారు. 2018 లో ఎమ్మెల్యేగా తన ఓటమిపై స్పందిస్తూ..  రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కూడా ఓడారని, కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద  చిత్తరంజన్ దాస్ ఇంట్లో ఉండి గెలిచారని గుర్తుచేశారు. 2019లో భువనగిరిలో తనపై పోటీచేసిన బూర నర్సయ్య రూ.80 కోట్లు ఖర్చు చేశారని, అయినా తానే గెలిచానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.  ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఎన్నో హైవేస్, రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చానని, కోమటిరెడ్డి తనకు చోటా బాయ్ అని సీఎంకు గడ్కరీ ఇటీవల చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి తాను 17 కేజీల బరువు తగ్గానని, కేసీఆర్ ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని దొంగ దీక్ష చేశారని అన్నారు.