- బీహెచ్ఈఎల్ జంక్షన్లో ఫ్లై ఓవర్‌కు రూ.172.56 కోట్లు ఖర్చుపెడుతున్నం
- ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు వేరే కాంట్రాక్టర్‌కు ఇచ్చామని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించే సిక్స్‌వే రోడ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేటాయించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు రూ.172.56 కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. దీనిని మార్చి 2025 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గురువారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కోదండరాం ఎన్‌హెచ్65 గురించి అడిగారు. ఇది ముఖ్యమైన జాతీయ రహదారి కావడంతో ఈ రూట్లో ప్రయాణించడం వాహనదారులకు కష్టంగా మారిందని, సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తిచేయాలని కోరారు.
మంత్రి సమాధానమిస్తూ లింగంపల్లి క్రాస్ రోడ్డు నుంచి అమీన్ పూర్ వెళ్లే రోడ్డులో బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద (ఎన్‌హెచ్6) 400 మీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయని, దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. అయితే, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరీంనగర్ జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్ పనులకు స్థల సేకరణ ఎంత వరకు వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించగా, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని, డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు.
బీఆర్ఎస్ సభ్యుడు వేణుగోపాలచారి మాట్లాడుతూ, ఉప్పల్ నుంచి వరంగల్ మీదుగా వెళ్లడం కష్టంగా మారిందని, అక్కడ కడుతున్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మంత్రి స్పందిస్తూ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను వేరే కాంట్రాక్టర్‌తో చేయిస్తున్నామని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ రోడ్డు అధ్వానంగా మారిందని బీఆర్ఎస్ సభ్యుడు శేరిసుభాష్ రెడ్డి తెలిపారు. బాచుపల్లి నుంచి మల్లంపేట, భౌరంపేట రోడ్ల నిర్మాణం కూడా అస్తవ్యస్థంగా ఉందని, ఈ రూట్లో వాటర్లైన్ల పనులకు అడ్డంకిగా మారిందన్నారు. మంత్రి సమాధానమిస్తూ వాటర్ లైన్లు తరలించేందుకు అధికారులను ఆదేశిస్తామన్నారు.