- మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండ, వెలుగు : విజయవాడ- –హైదరాబాద్ జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చేందుకు మేలో టెండర్లు పిలుస్తామని, రెండేండ్లలో రహదారి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆదివారం చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలతోపాటు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్- –విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 70 నుంచి 80 వేల వాహనాలు తిరుగుతాయని చెప్పారు. ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉంటే అద్దాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోదాడ, మిర్యాలగూడలో సైతం ఇలాంటి ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని మంత్రి వెల్లడించారు.
ఏఎన్సీ భవనాన్ని పూర్తిచేయాలి..
గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్ సీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంటినేటల్ పరీక్షల భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో భవనాన్ని నిర్మించాలన్నారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డల సంరక్షణకు చర్యలు, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డీఎంహెచ్ వో పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ వో వేణుగోపాల్ రెడ్డి, ఆర్టీవోలు లావణ్య, అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.