- ఆర్‌అండ్‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి
రాజాపేట, వెలుగు : రైతులు సైంటిస్టులు, అగ్రికల్చర్ అధికారుల సూచనలు పాటించి పంటల్లో అధిక దిగుబడులు సాధించాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బుధవారం రాజాపేట రైతు వేదికలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈ ప్రాంత రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిసారి పెద్ద ఎత్తున వడగళ్ల వానలు పడుతున్నాయని, ఇందుకు గల కారణాలను కనుక్కోవాలన్నారు. బీమా చెల్లించినప్పటికీ రైతులకు నష్టపరిహారం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పద్మావతి, ఏవో మాధవి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.