నల్గొండ అర్బన్, వెలుగు : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి-65ను ఆరు లేన్లుగా విస్తరింపజేస్తామని, మూడు నెలల్లో పనులు ప్రారంభించి, 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని కనగల్ మండలంలోని ధర్వేశిపురం రేణుకాఎల్లమ్మ దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ -– విజయవాడ జాతీయ రహదారిని 2009లో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి నాలుగు లేన్లుగా విస్తరింపజేశామన్నారు. అప్పుడు కాంట్రాక్టు తీసుకున్న జీఎమ్మార్ సంస్థ 2022 నాటికి 6 లేన్లుగా విస్తరించేలా పనులు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామని తెలిపారు. ఈ విషయమై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అనేకసార్లు కలిసి ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు.
త్వరలో త్రిపుల్ ఆర్ కు టెండర్లు..
అనుకున్న షెడ్యూల్ప్రకారం త్రిపుల్ ఆర్ పనులను మొదలు పెడతామని మంత్రి తెలిపారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. 161.518 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి రూ.7104.06 కోట్లతో 5 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచామని, ఫిబ్రవరి 14న పనులు ప్రారంభిస్తామని వివరించారు. ప్రజలు డిపాజిట్లు కోల్పోయేలా ఓడించినా బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తిరుమలగిరి–- సూర్యాపేట- రహదారిలో భూములు పోయాయని, ఫ్లైఓవర్ తో మళ్లీ భూములు కోల్పోతారని ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదన్నారు. బందర్ పోర్ట్, కాకినాడ పోర్ట్ నుంచి గుండ్రాంపల్లి, వెలిమినేడు వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం..
నల్గొండ జిల్లా తిప్పర్తిలో డీసీసీబీ బ్యాంకు నూతన భవనం, పీఏసీఎస్గోడౌన్, పర్జూర్ లో పీఏసీఎస్భవనం, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. అనంతరం కనగల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కనగల్ మండలం తిమ్మన్నగూడెం వద్ద ఆర్ అండ్ బీ సాగర్ రోడ్డు నుంచి కనగల్ వయా తిమ్మన్నగూడెం వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ధర్వేశిపురం రేణుకాఎల్లమ్మ దేవస్థాన చైర్మన్ వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.