ట్రిపుల్ ఆర్ నార్త్‌‌కు రెండు నెలల్లో అనుమతులు

ట్రిపుల్ ఆర్ నార్త్‌‌కు రెండు నెలల్లో అనుమతులు
  •  కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు: మంత్రి కోమటిరెడ్డి 
  • ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్ 
  • రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్ - విజయవాడ హైవే విస్తరణ
  • వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి 
  • రెండున్నరేండ్లలో నిర్మిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి 
  • రాష్ట్ర ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ 

న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు సంబంధించిన అనుమతులన్నీ రెండు నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తెలిపారు. అన్ని క్లియరెన్స్‌‌లు వచ్చాక కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఫైల్ పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకట్​రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2018–19లోనే ట్రిపుల్ ఆర్  ప్రకటించిందని, కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. తాము అధికారం చేపట్టిన తర్వాత నిత్యం కేంద్రంతో టచ్‌‌‌‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్తున్నామని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి వరకు టెండర్లు పిలిచామని తెలిపారు. ‘‘95శాతం భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే రైతులకు పరిహారం అందిస్తాం. అయితే, అంతకంటే ముందే కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రితో చర్చలు జరిపాం. రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇచ్చి, కేంద్ర కేబినెట్‌‌‌‌ ఆమోదానికి ఫైల్ పంపుతామని కేంద్రమంత్రి నితిన్‌‌‌‌ గడ్కరీ హామీ ఇచ్చారు” అని వెల్లడించారు. అలాగే ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఫైనల్ చేసి, ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్టు వివరించారు.   

ఐదు రోప్‌‌‌‌వే ప్రాజెక్టులు అడిగినం.. 

హైదరాబాద్‌‌‌‌–విజయవాడ ఆరు లేన్ల రహదారిని రెండు ప్యాకేజీలుగా నిర్మించాలని కోరగా, అందుకు కేంద్రమంత్రి గడ్కరీ అంగీకరించారని కోమటిరెడ్డి తెలిపారు. ‘‘ఈ రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని గడ్కరీ చెప్పారు. అయితే హెదరాబాద్‌‌‌‌–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరితగతిన టెండర్లు పిలవాలని కేంద్రమంత్రిని కోరాం. ఈ నేపథ్యంలో రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. మొదటి ప్యాకేజీలో మల్కాపూర్‌‌‌‌–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో రెండు ఆర్వోబీలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు” అని వెల్లడించారు. హైదరాబాద్-–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌‌‌‌‌లో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళ్తున్నదని, దీనికి అటవీ అనుమతులు రాలేదన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ‘‘రూ.1,200 కోట్లతో సోమశిల వద్ద కేబుల్‌‌‌‌ బ్రిడ్జి, పర్వతమాల ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఐదు రోప్‌‌‌‌వేలు ఇవ్వాలని గడ్కరీని కోరాను. వీటిలో యాదగిరిగుట్ట ఆలయం (2 కి.మీ),  భువనగిరి కోట (1 కి.మీ), నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ (2 కి.మీ), మంథనిలోని రామగిరి కోట (2 కి.మీ), నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జునకొండను (5 కి.మీ) కలిపే రోప్‌‌‌‌వే ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు” అని తెలిపారు. 
  
ఐదు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు ఇవ్వాలని కోరినం.. 

రామగుండం, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌‌‌‌కు ఎయిర్‌‌‌‌పోర్టులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్టు కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లో టెక్నికల్‌‌‌‌ ఫీజిబులిటి రిపోర్టును మరోసారి పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ‘‘దాదాపు 20 ఏండ్లుగా మామునూరు (వరంగల్) ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ పేరు వింటున్నా... అది కార్యరూపం దాల్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు లైన్ క్లియర్ అయింది. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుగా నిర్మించాలని కేంద్రమంత్రిని కోరాం. ఎయిర్‌‌‌‌పోర్టుకు సంబంధించిన భూసేకణ 15రోజుల్లో పూర్తవుతుంది. రెండున్నరేండ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు” అని వెల్లడించారు.   కేంద్రమంత్రులతో సమావేశంలో ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు.

వారంలో తెలంగాణ భవన్‌‌‌‌కు టెండర్లు..  

ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పూర్తి చేసినట్టు కోమటిరెడ్డి తెలిపారు. పటౌడీ హౌస్‌‌‌‌లోని ఐదున్నర ఎకరాల్లో భవన్ నిర్మాణానికి వారం, పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. ‘‘గత పదేండ్లుగా రెండు రాష్ట్రాల మధ్య భూపంపకాలు జరగకపోవడంతో భవన్ నిర్మాణం ఆలస్యమైంది. మా ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల్లోనే 42:58 నిష్పత్తిలో భూవిభజన పూర్తి చేశాం. ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఈ గెస్ట్ హౌస్‌‌‌‌ నిర్మాణం ఉటుంది. రాష్ట్ర భవన నిర్మాణం అంటే ఆషామాషీ కాదు. కట్టినమంటే 500 ఏండ్లు ఉండాలి. ఢిల్లీలో నిజాం కట్టిన హైదరాబాద్ హౌస్ చూడండి.. ఎలా ఉందో. అలా చెక్కుచెదరకుండా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. రాష్ట్ర ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖనే ఈ భవనాన్ని నిర్మిస్తుంది. ఎవరికీ ఇచ్చేది లేదు’’ అని తెలిపారు.