బీజేపీలో బీఆర్ఎస్​ విలీనం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీజేపీలో బీఆర్ఎస్​ విలీనం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • అందుకే కేంద్ర బడ్జెట్ పై​ కేసీఆర్ ​కామెంట్ చేయలేదు: మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు: బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్​ అడుగులు వేస్తోందని.. ఈ విషయంలో తనకు, సీఎం రేవంత్​ రెడ్డికి పక్కా సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర బడ్జెట్ పై​కేసీఆర్​ ఒక్క కామెంట్ కూడా చేయలేదన్నారు. అదే రూ.2లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్​ పైన ఆరోపణలు చేశారని ఆయన ఫైర్​ అయ్యారు. శుక్రవారం నల్గొండలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. 8 నెలల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఇంటికే పరిమితమైన కేసీఆర్..​ రాష్ట్ర బడ్జెట్ పైన అవాకులు చవాకులు పేలడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ పార్టీని చీల్చిచెండాడేది తానేని చెప్తున్న కేసీఆర్..​ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో ఆ పనిచేశారని ఎద్దేవా చేశారు. 

ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రజలు బీఆర్ఎస్​ పార్టీనీ చీల్చి చెండాడారని విమర్శించారు. అదే నేనైతే ఈపాటికే పార్టీ దుకాణం బంద్​ చేసి, రాజకీయ సన్యాసం తీసుకునేవాడినని, కేసీఆర్​ ఏ మొఖం పెట్టుకుని కాంగ్రెస్​ను చీల్చి చెండాడుతానని అంటారని మంత్రి మండిపడ్డారు. ‘రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 72 వేల కోట్ల అప్పు ఉంటే.. గడిచిన పదేండ్లలో 61 లక్షల 75 వేల కోట్ల అప్పు చేశారు. ఈ డబ్బంతా కేసీఆర్ ఏం చేసిండు? దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. కానీ, కాంగ్రెస్ నిన్న ప్రకటించిన బడ్జెట్ లో సాగు నీటికి కేటాయించిన 22 వేల కోట్లలో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకే ప్రాధాన్యం ఇచ్చాం. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎస్ఎల్​బీసీ, బ్రాహ్మణ వెల్లంల, డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం, ఖమ్మం జిల్లాలో  సీతారామ ప్రాజెక్టు, మహబూబ్​నగర్​లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు కేటాయించాం. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ భద్రత ఉండేలా స్కిల్​ని వృద్ధి చేసేందుకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బిజినెస్​ స్కూల్​ మోడల్​లో స్కిల్​డెవలప్మెంట్​ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్​ఆమోదం తెలిపింది”అని మంత్రి పేర్కొన్నారు.