నల్గొండ అర్బన్, సూర్యాపేట, వెలుగు : పోలీస్ స్టేషన్ అంటే ప్రజల బాధలను తీర్చే కేంద్రమని, సమాజంలో పోలీసుల పాత్ర మరువలేనిదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించడానికైనా వెనకాడని సేవకులు.. పోలీసులు అని కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అమరులైన ప్రతి పోలీసు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు వారి జీవితాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఎందరో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, జిల్లాలో 15 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. పోలీస్అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు. అంతేకాక కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అమరుల పోలీస్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రు.25 వేల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు.
వారి పిల్లల ఉన్నత చదువులకు సైతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్అమరవీరుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నల్గొండ జిల్లాలో 1991 నుంచి 2024 వరకు 15 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదన్నారు. అనంతరం పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు.
అంతకుముందు విధి నిర్వహణలో అమరులైన 15 మంది పోలీసు కుటుంబ సభ్యులకు మంత్రి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పీ రాములునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, డీఎస్పీలు, పోలీసు అధికారులుపాల్గొన్నారు.
శాంతిభద్రత రక్షణలో పోలీసు సేవలు గొప్పవి..
శాంతి భద్రత రక్షణలో పోలీసుల సేవలు చాలా గొప్పవని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలోని పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ పోలీసు అమరవీరులు త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పోలీస్ అమరవీరుల ఆశయ సాధన కోసం పౌరులు, పోలీసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు, పోలీస్అధికారులు తదితరులు పాల్గొన్నారు.