కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్యానికి ప్రయారిటీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి వెల్లడి

కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్యానికి ప్రయారిటీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి వెల్లడి

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా కనగల్‌‌లో నిర్మించిన పీహెచ్‌‌సీని, గ్లకోమా కేంద్రాన్ని, కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఏర్పాటుచేసిన వాటర్‌‌ ప్లాంట్‌‌ను బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కంటి వ్యాధులకు సంబంధించిన గ్లకోమా సెంటర్‌‌ను రాష్ట్రంలోనే మొదటిసారిగా కనగల్‌‌ పీహెచ్‌‌సీలో ప్రారంభించినట్లు తెలిపారు. టెస్ట్‌‌ల ద్వారా ముందుగానే వ్యాధులను గుర్తిస్తే ట్రీట్‌‌మెంట్‌‌ ఈజీ అవుతుందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మోడల్‌‌ పీహెచ్‌‌సీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

పేదలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం గత 15 నెలల్లో రూ.1,600 కోట్ల విలువైన ఎల్‌‌వోసీలను విడుదల చేసిందన్నారు. 24 గంటల్లోనే ఎల్‌‌వోసీలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఎల్‌‌వోసీ ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే హైదరాబాద్‌‌లో నాలుగు టిమ్స్‌‌ హాస్పిటళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 

ఉస్మానియా హాస్పిటల్‌‌ కోసం గోషా మహల్‌‌ స్టేడియంలో రూ. 2,600 కోట్ల కొత్త బిల్డింగ్‌‌ను నిర్మిస్తున్నామన్నారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలోనూ గ్లకోమా సెంటర్‌‌ను ప్రారంభిస్తామన్నారు. నల్గొండ సర్కార్‌‌ హాస్పిటల్‌‌లో నిర్వహించిన క్రిటికల్‌‌ కేర్‌‌ యూనిట్‌‌ను ఈ నెలాఖరు నాటికి ప్రారంభిస్తామన్నారు. నల్గొండ నుంచి డిప్యుటేషన్‌‌పై వెళ్లిన 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్‌‌వో పుట్ల శ్రీనివాస్, మెడికల్‌‌ ఆఫీసర్‌‌ రామకృష్ణ పాల్గొన్నారు.