- హరీశ్ మామ చాటు అల్లుడు.. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- కేసీఆర్ పార్టీని కాపాడుకోలేకపోతుండని విమర్శ
- గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఓ బచ్చా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ తన కాలి గోటికి సరిపోరని మండిపడ్డారు. కేటీఆర్ తండ్రి చాటు కోడుకు అని, హరీశ్ మామ చాటు అల్లుడని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్..13 నెలలుగా అసెంబ్లీకి రావడం లేదని, అలాంటప్పుడు ఆయనకు ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ నయం అని అన్నారు.
ఆయన జైల్లో ఉన్నా.. తన పార్టీని కాపాడుకున్నారని.. కానీ, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి కూడా బీఆర్ఎస్ను కాపాడుకోలేకపోతుండని విమర్శించారు. రెండు నెలల విరామం తర్వాత గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 799 అర్జీలను మంత్రి స్వీకరించారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండలో కేటీఆర్ సభకు వచ్చిన జనం కన్నా రోడ్లపై పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునే షాపుల వద్ద ఉండే జనం ఎక్కువని ఎద్దేవా చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ను పెంచి పోషించారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ గద్దర్ పై బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా? బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి ప్రశ్నించారు.
చిట్ ఫండ్స్ మోసాలపైనే ఎక్కువ వినతులు..
మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మొత్తం 799 అర్జీలను మంత్రి స్వీకరించారు. ఇందులో ఎక్కువగా చిట్ ఫండ్స్ మోసాలపైనే వచ్చాయి. ఏకంగా 253 అర్జీలు వీటిపైనే వచ్చాయి. అక్షర చిట్ ఫండ్ బాధితులు ఇందులో ఎక్కువగా ఉన్నారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి.. అక్కడి నుంచే నేరుగా డీజీపీ జితేందర్ తో ఫోన్ లో మాట్లాడారు. చిట్ఫండ్ యజమాని పేరాల శ్రీనివాస రావు నుంచి పేదల సొమ్మును రికవరీ చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ చిట్ ఫండ్ యజమాని శ్రీనివాస రావు చుట్టం కావడం వల్లే ఇంతకాలం ఈయన్ను కాపాడుతూ వస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు రూ. 500 కోట్ల స్కాం ఇది అని, దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి పేదల సొమ్మును రికవరీ చేయాలని, అవసరమైతే దీనిపై సీఎంతో కూడా మాట్లాడుతానని మంత్రి చెప్పారు.