- నల్గొండ జిల్లా తిప్పర్తి జడ్పీ హైస్కూల్‌లో టీచర్లు, స్టూడెంట్లతో ముఖాముఖి
నల్గొండ అర్బన్ (తిప్పర్తి), వెలుగు : నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ను గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా టీచర్లు, స్టూడెంట్లతో ముఖాముఖి నిర్వహించారు. గతేడాది టెన్త్‌లో ఎంత మంది స్టూడెంట్లు పాస్ అయ్యారని టీచర్లను అడుగగా 16 మందికి 14 మంది పాస్ అయ్యారని హెచ్‌ఎం చెప్పారు. దీంతో టెన్త్‌లో ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కావొద్దని, తప్పనిసరిగా 9.5 పైనే గ్రేడ్ రావాలని ఇందుకు టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.
టెన్త్ స్టూడెంట్ల వద్దకు వెళ్లి వారు భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్లు చదువుపై దృష్టి సారించాలని, ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. గొప్ప గొప్ప వాళ్లంతా సర్కార్ స్కూళ్లలో చదువుకున్న వారేనని చెప్పారు. స్కూల్‌కు అవసరమైన డ్యూయల్ డెస్క్‌లను మూడు, నాలుగు రోజుల్లో పంపిస్తామని చెప్పారు. స్కూల్‌లో తాగునీటి కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని స్టూడెంట్లు కోరడంతో వెంటనే మంజూరు చేశారు. అలాగే నాలుగు టాయిలెట్ల నిర్మాణంతో పాటు ముగ్గురు స్కావెంజర్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం డిజిటల్ బోర్డులపై బోధనా విధానాన్ని పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర వివరాలను అందజేయాలని డీఈవోను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో నాగిరెడ్డి, డీఈవో భిక్షపతి, మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య, ఆర్డీవో రవి, డీఎస్పీ శివరామిరెడ్డి ఉన్నారు.