ఇలాంటి కలెక్టర్ మన జిల్లాలో పని చేయడం అదృష్టం: మంత్రి కోమటిరెడ్డి

ఇలాంటి కలెక్టర్ మన జిల్లాలో పని చేయడం అదృష్టం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా రాష్ట్రంలో ప్రభుత్వ  జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం (మార్చి 5) -కనగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేంద్ర యూనివర్సిటీ సౌజన్యంతో గ్లూకోమా టెస్టింగ్ మిషన్లను నూతనంగా ఏర్పాటు చేసిన కనగల్ పీహెచ్సీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటగా కనగల్ మండల కేంద్రాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని 2025, మార్చి 6 నుంచి 300 మందికి గ్లూకోమ టెస్టులు చేయనున్నామని చెప్పారు. 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు గ్లూకోమా టెస్టులకు సహకరించాలని కోరారు. మెరుగైన వైద్యం కోసం ప్రతి నియోజకవర్గంలో మోడల్ పీహెచ్‎సీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. తొందరలోనే ప్రతి నియోజకవర్గంలో మోడల్ పీహెచ్‎సీ ఏర్పాటు చేస్తామన్నారు.

కనగల్ మండల కేంద్రంలోని తిమ్మన్నగూడెం నుండి సాగర్ హైవేకు రూ.15 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని.. అతి త్వరలో రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. గ్రామాలలో లింకు రోడ్లను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నల్లగొండ వరప్రదాయిని ఎస్ఎల్‎బీసీ టన్నెల్ కూలడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ పూర్తి అయితే నల్గొండ నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలమవుతుందన్నారు.

కనగల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరు చేశామని.. వచ్చే అకాడమీకి ఇయర్ నాటికి బిల్డింగ్ పూర్తి చేసి కాలేజీ ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే.. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ హాస్టల్స్‎కు నూతన బిల్డింగులను కట్టిస్తామని చెప్పారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయంలో కూడా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్విరామంగా జిల్లా మొత్తం తిరుగుతూ.. ఆయా మండలాలలోని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్టల్స్‎ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లాను సురక్షితంగా చూసుకుంటున్నారని.. ఇలాంటి కలెక్టర్ మన జిల్లాలో పని చేయడం అదృష్టమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ ఓ కళ్యాణ్ చక్రవర్తి, మండల పీహెచ్సీ డాక్టర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మండల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.