
నల్లగొండ: తెలంగాణ బడ్జెట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (మార్చి 20) ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ ప్రతిఫలాలు అందించే విధంగా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్ పెద్దపీటవేయగా.. అందులో నల్గొండ జిల్లా ముందుందన్నారు. నల్గొండ జిల్లాలో ఈ రబీలో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగడంతో ధాన్యం దిగుబడి పెరిగిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు బడ్జెట్లో రెండింతలు నిధులు పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ వెల్లంలలో నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని.. కాలువలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు గాను రూ.37 కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. డిసెంబర్ నాటికి లక్ష ఎకరాలకు నీరివ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
పాఠశాల విద్యలో భాగంగా రూ.11 వేల కోట్ల రూపాయలతో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలు ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పిల్లలకు 6 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. ఆర్ అండ్ బీ బడ్జెట్లో భాగంగా రూ.5900 కోట్లతో 12,000 కిలోమీటర్ల రోడ్లకు వచ్చేనెల 2న టెండర్లు పిలువనున్నామని తెలిపారు. నూతన హైకోర్టు భవనం, రూ.2700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం జరుగుతుందన్నారు.