వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఎక్కడ దాక్కున్న పట్టుకొచ్చి జైల్లో వేస్తం: మంత్రి కోమటిరెడ్డి

వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఎక్కడ దాక్కున్న పట్టుకొచ్చి జైల్లో వేస్తం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేయడం అమానుషమని, అధికారం కోల్పోవడంతో ఫ్రస్టేషన్‎లో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దాడి చేసిన వారితో పాటు దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పాల్గొన్న వారిని విడిచిపెట్టమని.. అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

2024, నవంబర్ 13వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన వారు కేటీఆర్‎తో ఫోన్‎లో టచ్‎లోనే ఉన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చని సూచించిన మంత్రి.. కలెక్టర్, అధికారులపై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 

ALSO READ | Vikarabad Incident: సురేశ్ కాల్ డేటాలో విస్తుపోయే నిజాలు.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఇక ఫోన్ ట్యాపింగ్‎లో ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే.. వారు ఎక్కడ దాక్కున్న రప్పించి జైలుకు పంపిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తి కొనుగోళ్లపై నెలకొన్న సందిగ్ధంపై నోరు మెదపడం లేదని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం పత్తికి మద్దతు ధర గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. నోరు తెరిస్తే మూసీ ప్రక్షాళను అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. 

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొందరు రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. రైతులను ఇబ్బందులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని.. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వారం రోజులల్లోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతులు వరి కోతలు ప్రారంభించారని.. రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.