లిక్కర్​ కేసులో బెయిల్​ వస్తే సంబురాలా?

లిక్కర్​ కేసులో బెయిల్​ వస్తే సంబురాలా?
  • కవిత ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధురాలా? 
  • బీఆర్​ఎస్​ శ్రేణులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్​ 

నల్గొండ, వెలుగు: ‘కవిత ఏమైనా స్వాతంత్ర సమరయోధురాలా? లిక్కర్​ కేసులో అవినీతి చేసి జైలుకెళ్లి వచ్చింది. ఆమె కోసం సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కేవలం బెయిల్​ వచ్చినంత మాత్రాన బాంబులు పేల్చడం, స్వీట్లు పంచడం ఎందుకుని ప్రశ్నించారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

శ్రీశైలం సొరంగ మార్గానికి నిధులు కావాలని ఎన్నిసార్లు అడిగినా మాజీ సీఎంలు కిరణ్​కుమార్​రెడ్డి, కేసీఆర్ స్పందించలేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి సొరంగ మార్గానికి రూ.2,200 కోట్లు కేటాయించారని, వచ్చే రెండేళ్లలో సొరంగ మార్గం పూర్తిచేస్తామని చెప్పారు. నల్గొండలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్​కాలేజీ భవనాన్ని సెప్టెంబర్ 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

 జిల్లాకు యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మంత్రి దృష్టికి తీసుకురాగా, 4 వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆర్​అండ్​బీ ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి.. నల్గొండ నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.250 కోట్లు శాంక్షన్ చేశామని, పెండింగ్​లో ఉన్న రూ.165 కోట్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు.