
నల్గొండ, వెలుగు: నల్గొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రమాద బాధితులు, పురుగులు మందు తాగిన వారు, గుండెపోటు బాధితులకు సేవలు అందుతాయి. క్రిటికల్ కేర్ యూనిట్ కోసం రూ.23.75 కోట్లు మంజూరు కాగా, రూ.16.25 కోట్లతో బిల్డింగ్, రూ.7.50 కోట్లతో పరికరాలు సమకూర్చారు. 50 పడకలతో క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయగా, శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఏడాదిలోగా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన సౌలతులు కల్పిస్తామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.22 కోట్ల ఎల్ఓసీలు ఇచ్చామని, ఉదయం దరఖాస్తు చేసుకుంటే సాయంత్రంలోగా ఎల్ఓసీ ఇస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్, వరంగల్ తరువాత నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించామని, గాంధీ, నీలోఫర్ తరువాత ఎక్కువ డెలివరీలు ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్–విజయవాడ, నార్కెట్పల్లి– అద్దంకి హైవేలు ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏడాదిలో క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేదలు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి కార్పొరేట్ వైద్యం పొందలేరనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని వెల్లడించారు.