- ‘బ్రహ్మాండ’ సినిమా టీజర్ విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలుగు సినిమా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్ లో బన్నీ రాజు హీరోగా ఒగ్గు కళాకారుల జీవన నేపథ్యంలో రూపొందిన ‘బ్రహ్మాండ’ సినిమా టీజర్ ను మంత్రి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆధ్యాత్మిక, గ్రామీణ కళాకారుల జీవితాల నేపథ్యంలో అరుదుగా సినిమాలు వస్తుంటాయని చెప్పారు.
తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం, జానపదాలపై సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ కళారూపాలు అంతరించిపోతున్నాయని ఆందోళన పడుతున్న వేళ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ‘బ్రహ్మాండ’ సినిమా రావడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దాసరి సురేశ్, డైరెక్టర్ బన్నీ రాంబాబు పాల్గొన్నారు.