
- ప్రభుత్వ సర్వీసులో చేరి, వైద్య సేవలందించండి
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థుల కాన్వకేషన్
నల్గొండ అర్బన్, వెలుగు: ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే కాదని.. మనుషుల ప్రాణాలు నిలబెట్టే ఆయుధమని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైద్య డిగ్రీ పట్టా పొందినవారు ప్రభుత్వ సర్వీసులో చేరి, ప్రజలకు వైద్య సేవలందించాలని సూచించారు. గురువారం నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థుల కాన్వొకేషన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎంతోమంది వైద్యులు పేదలకువైద్య సేవలందించి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందారని గుర్తు చేశారు.
మన రాష్ట్రం నుంచి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ చేయూత, 108 అంబులెన్స్ లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 40 వేల చదరపు అడుగుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మించామని, ఈ నెల 5న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎంబీబీఎస్పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్నరేంద్ర కుమార్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎంహెచ్వో శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.