ఓఆర్ఆర్ టోల్ లీజుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మామను, బామ్మర్దిని ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై హరీష్ రావు సిట్ ఏర్పాటు చేయాలని కోరారని అన్నారు. హరీష్ రావు కోరినట్లుగానే ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఓఆర్ఆర్ లీజు అవకతవకలపై విచారణ జరుగుతుందని.. చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. అదే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఫార్ములా 1 రేసులో దొంగలు దొరికారని చెప్పిన మంత్రి .. ఓఆర్ఆర్ టోల్ లీజులో కూడా అవకతవకలు చేసిన వాళ్ళు బయటకు వస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ALSO READ | కేవలం నోటి మాటలతో ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) హైదరాబాద్ నగరానికి మణిహారం లాంటిదని, 2017 లో కేంద్రం నుండి అనుమతి వచ్చినా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల పూర్తి కాలేదని విమర్శించారు. తాను స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో మాట్లాడి , ఆర్ఆర్ఆర్ నార్త్ పనులకు టెండర్లు వేసేలా చూశానని తెలిపారు. తెలంగాణ లో 50 శాతం రోడ్డును ఆర్ఆర్ఆర్ కవర్ చేస్తుందని, హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్ పాత్ర కీలకమైనదిగా ఉంటుందని తెలిపారు.