గొర్రెల స్కీమ్​లో 4,500 కోట్లు స్కామ్ : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

గొర్రెల స్కీమ్​లో 4,500 కోట్లు స్కామ్ : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  •     కేసీఆర్​ అమలు చేసిన ప్రతి స్కీమ్​లో అవినీతే: మంత్రి వెంకట్​రెడ్డి
  •     కౌంటింగ్​మరుసటి రోజు బీఆర్ఎస్​ ఆఫీస్​కు తాళమే
  •     ఆ పార్టీలో నలుగురే మిగులుతరు 
  •     చరిత్రలో నిలిచేలా రాష్ట్ర అవతరణ వేడుకలు
  •     కేసీఆర్​ వచ్చేది.. రానిది ఆయన ఇష్టమని కామెంట్

నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ​హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్​లో రూ.4,500 కోట్ల  స్కామ్​ జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన ప్రతి స్కీమ్​లో అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరకు బతుకమ్మ మాటున లిక్కర్​ స్కామ్ చేశారని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్​ చేశారు. 

శనివారం ఓ ప్రైవేట్​ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ​నిజామాబాద్​వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందూరు​సహా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ​12 ఎంపీ​సీట్లు గెలువబోతోందన్నారు. బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కౌంటింగ్​ మరుసటి రోజు జూన్​ 5న బీఆర్ఎస్​ పార్టీ ఆఫీసుకు తాళం పడుతుందని, ఆ పార్టీలో చివరకు నలుగురే మిగులుతారని.. వారెవరో అందరికీ తెలుసన్నారు. బీజేపీ మత రాజకీయాల ఎజెండాతో పాలిటిక్స్​చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్​ ఎంపీగా గెలవబోయేజీవన్​రెడ్డి కేంద్రంలోని ఇండియా కూటమి గవర్నమెంట్​లో మంత్రి అవుతారని మంత్రి పేర్కొన్నారు. 

ఫోన్​ ట్యాపింగ్ దోషులు మూల్యం చెల్లించక తప్పదు

బీఆర్ఎస్​ సర్కారు టైంలో ఫోన్​ ట్యాపింగ్ కు పాల్పడిన​ దోషులు మూల్యం చెల్లించక తప్పదని మంత్రి వెంకట్​రెడ్డి అన్నారు. ఈ కేసులో చట్ట పరిధిలో వ్యవహరిస్తామన్నారు. పదేండ్లు సీఎం హోదాలో కేసీఆర్​ నియంతలా పనిచేశారని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌‌‌‌మెంట్​​ ఇవ్వలేదన్నారు. ఎంపీగా తాను కేసీఆర్‌‌‌‌ను​ కలవడానికి ప్రయత్నిస్తే.. దగ్గరకు రానీయలేదని, వెయ్యి లెటర్లు రాసినా పట్టించుకోలేదన్నారు. తాను నిత్యం పది వేల మందిని కలుస్తున్నానని మంత్రి తెలిపారు. ప్రజల ఆదరణతో పొందిన పదవులు వారి సేవ కోసం ఉద్దేశించినవనే నిజాన్ని కేసీఆర్​ విస్మరించడంతో ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. వచ్చే పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్​ గవర్నమెంటే ఉంటదని, రేవంత్​ రెడ్డే సీఎంగా పనిచేస్తారని వెంకట్​రెడ్డి అన్నారు. 

పదేండ్లు రాష్ట్ర గీతం లేకుండా చేశారు

గడిచిన పదేండ్లలో తెలంగాణకు రాష్ట్ర గీతం లేకుండా చేశారని మంత్రి వెంకట్​రెడ్డి ఆరోపించారు. అందెశ్రీ రాసిన పాటకు అర్హత ఉన్నా కేసీఆర్ అణచివేశారన్నారు. ఇప్పుడా నిర్బంధం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నం, ఇతర అంశాలపై అసెంబ్లీలో అఖిలపక్షంతో చర్చించి కేబినెట్​లో పెట్టి నిర్ణయిస్తామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గవర్నమెంట్​ నిర్వహించనుందన్నారు. 

ప్రతిపక్ష నేత కేసీఆర్​ను ఇందులో పాల్గొనాలని ఆహ్వానం పంపామని.. వచ్చేది, రానిది ఆయన ఇష్టమన్నారు. 15వ తేదీ నుంచి తమ ఫోకస్ అంతా పాలనపైనే ఉంటుందన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ​వైఎస్సార్​సీపీకి అనుకూలంగా ఉండే చాన్స్​ కనబడుతోందని, రాబోయే రోజుల్లో అక్కడా కాంగ్రెస్​ బలపడుతుందన్నారు. అనంతరం జాతీయ టెన్నిస్​ పోటీలో గోల్డ్​ మెడల్​ పొందిన ధర్పల్లి మండలానికి చెందిన మౌనికకు మంత్రి రూ.50 వేల వ్యక్తిగత ప్రోత్సాహం అందించారు. సమావేశంలో నిజామాబాద్ రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి, గడుగు గంగాధర్​ తదితరులు పాల్గొన్నారు.