కాంగ్రెస్ ని టచ్ చేస్తే.. బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు కూడా ఉండవ్: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే... దోపిడీ సొమ్ముతో కేసీఆర్ మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే... హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నల్లగొండ టౌన్ లో మంత్రి కోమటిరెడ్డి  పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేశారు. తర్వాత శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి.

అనంతరం మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 30మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా.. తాము వద్దంటున్నామని చెప్పారు. తాము అనుకుంటే 9మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరన్నారు. ముఖ్యమంత్రిని లిల్లీ పుట్ అంటావా?.... ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని... దొంగ పాస్ పోర్ట్ లు చేయలేదన్నారు. విటమిన్ డీ తీసుకొని.. దొంగ దీక్షలు చేసి.. చావు నోట్లో తల పెట్టి ఉద్యమం చేశానని కేసీఆర్ చెప్పుకుంటున్నాడని విమర్శించారు. కూతురు జైలుకు పోయినా బుద్ది మారలేదా? అని దుయ్యబట్టారు.
 
అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి. మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి తాను వెళ్ళాక.. రైతుల ధాన్యం రూ.2500కు కొన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే రెండు సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదని... 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కవిత జైలుకు పోయాక కేసీఆర్ కు మెంటల్ వచ్చినట్లు ఉందని.. అందుకే, రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నాడని ఎద్దేవా చేశారు. రెండేళ్లైనా కవితకు బెయిల్ రాదని ఆయన అన్నారు.  కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడుతాం అంటున్నారని.. ఇకనుంచి తాము కూడా వెంటాడుతామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.