వరంగల్, వెలుగు : వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో బీఆర్‌ఎస్ లీడర్లు బినామీ పేర్లతో దందా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. రూ.24 కోట్లతో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రయదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు షాపులు కేటాయించారన్నారు. అలాంటివారంతా మార్కెట్‌లో దందా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కూరగాయల మార్కెట్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో అనర్హుల నుంచి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు.
మార్కెట్‌లో గత సెక్రటరీ కేటాయించిన దుకాణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సెక్రటరీ, జిల్లా కలెక్టర్ సత్యశారదను ఆదేశించారు. మార్కెట్‌లో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో పార్కింగ్, షెడ్‌తో పాటు సీసీ రోడ్డు, మురుగు కాల్వలు నిర్మిస్తామని, మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఆలయం, కమ్యూనిటీ హాల్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. మార్కెట్‌లో ప్లాస్టిక్‌ను నిషేధించాలని, ప్లాస్టిక్ ఉపయోగించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నోటీసులు ఇవ్వాలని, అయినా మారకపోతే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో షాపుల కిరాయిలు ఎక్కువగా ఉన్నాయని విక్రయదారులు మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడారు.
కావాల్సిన ప్రపోజల్స్ పంపాలని ఆఫీసర్లకు సూచించారు. మార్కెట్‌లో కావాల్సిన సౌకర్యాలు కల్పించి మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్ట దేవాలయ గోపుర స్వర్ణతాపడం పనులు మొదలయ్యాయని, త్వరలో వేములవాడ గోపుర స్వర్ణతాపడ పనులను సైతం మొదలుపెడుతామని చెప్పారు. అనంతరం ఆర్టీసీ బస్‌స్టేషన్ పనుల పురోగతిపై ఆఫీసర్లతో మాట్లాడారు. అనంతరం 34వ డివిజన్ శివనగర్ రామాలయంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే ఉన్నారు.