కమీషన్ల కోసమే కొత్త దవాఖాన: మంత్రి కొండా సురేఖ

  •  రూ.1,116 కోట్లకు బదులు రూ.3,779 కోట్ల ఖర్చు  

వరంగల్: కమీషన్ల  కోసమే వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో  కొత్త హాస్పిటల్​ వ్యయాన్ని గత  ప్రభుత్వం పెంచిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.  మంత్రి అయ్యాక మొదటిసారి వరంగల్ వచ్చిన మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.

కమీషన్ల కోసమే వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో   24 అంతస్తుల సూపర్ స్పెషల్ హాస్పిటల్  నిర్మిస్తున్నారని మండిపడ్డారు.  కమీషన్ల కోసమే  హాస్పిటల్ నిర్మాణ ఖర్చు పెంచే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే రూ.1,116 కోట్లు అయ్యే  నిర్మాణ ఖర్చును తప్పుడు లెక్కలతో రూ.3,779 కోట్లుగా చూపారని ఆరోపించారు.  వీటన్నింటిపై ప్రభుత్వం విచారణ చేస్తుందని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులపై  కాంగ్రెస్​ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. అయితే చేసిన తప్పుల నుండి తప్పించుకోవడానికే బీఆర్​ఎస్​ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేయాలో తమకు తెలుసని స్పష్టం చేశారు.  కేసీఆర్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది కాబట్టే జనాలు వారిని ఓడించారని పేర్కొన్నారు.  ప్రజలకు పూర్తి జవాబుదారీగా వ్యవహరిస్తున్నామన్నారు.

త్వరలో జరిగే- మేడారం జాతర గ్రాండ్ సక్సెస్ చేస్తామని సురేఖ తెలిపారు.  రాష్ర్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచి పర్యావరణం కాపాడుతామని పేర్కొన్నారు. వరంగల్ మహా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కొండా సురేఖ పేర్కొన్నారు.