
- ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వని బీఆర్ఎస్కు ప్రశ్నించే అర్హతే లేదు: మంత్రి కొండా సురేఖ
- ఇయ్యలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి
- కృష్ణా,గోదావరి జలాలను తరలించడంలో గత ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, రేషన్ కార్డుల విషయంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం జరిగింది. జీవన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తనపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత అడిగిన ప్రశ్నలకు తాము సమాధానం చెప్తుంటే రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని, సభా సంప్రదాయాలను పాటించాలని సూచించారు.
పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని బీఆర్ఎస్ నేతలకు రేషన్ కార్డుల గురించి ప్రశ్నించే అర్హతే లేదన్నారు. దీంతో సభలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనచారి మంత్రి కొండా సురేఖకు సమాధానమిస్తూ ‘నోరు మీకే కాదు మాకూ ఉంది..మేము కూడా మాట్లాడగలం’ అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని నిరూపిస్తే తమపై సభ ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమేనని సవాల్ చేశారు.
అప్పులు, రేషన్ కార్డులే ప్రధానాంశాలుగా..
రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పులు, రేషన్ కార్డుల చుట్టే మండలి సమావేశం జరిగింది. సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని పార్టీలకు అతీతంగా స్వాగతించాలన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని జీవన్ రెడ్డి సభకు తెలిపారు. మూసీ ప్రక్షాళన, మెట్రో, ఆర్ఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని అన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. అనంతరం స్పెషల్ మెన్షన్‌లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం ఇచ్చారు. సమస్యలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న బడ్జెట్, అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలు సహా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీసుకోవల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
బడ్జెట్లో లక్ష కోట్లు వడ్డీలకే పోతయ్: జీవన్ రెడ్డి
గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందని.. ఆ అప్పుకు ప్రతి నెల రూ.6,500 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పారు. ఇలా ఏటా రూ.80 వేల కోట్లు వడ్డీకే పోతున్నాయని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున.. ఇందులో రూ.లక్ష కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకే సరిపోతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలను రాష్ట్రానికి తరలించడంతో గత పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతికను వదిలి కేసీఆర్ తన సొంత తెలివిని ప్రదర్శించారని విమర్శించారు.
దీంతో పాటు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్, సుందిళ్లకు నీరు తరలింపులో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నదని అన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం మొదలు పెట్టామని చెప్పారు.
బీఆర్ఎస్ శాంపిల్ సర్కార్: మహేశ్ కుమార్
బీఆర్ఎస్ ప్రభుత్వం శాంపిల్ సర్కారేనని ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల కోసం తాము ఒక మెట్టు దిగుతాము కానీ, బెట్టు చేయబోమని అన్నారు. కేసీఆర్ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని, ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. తమ ప్రభుత్వం 14 నెలలో సాధించిన ప్రగతికి గవర్నర్ ప్రసంగం అద్ధంపట్టిందన్నారు. నిజాయితీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 9 నెలలల్లోనే తమ ప్రభుత్వం 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తప్ప ప్రభుత్వ హాస్పిటళ్లను పట్టించుకోలేదని తెలిపారు. తాము ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునికీకరిస్తున్నామని అన్నారు. స్పోర్ట్స్ కోసం రూ.350 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ బోగస్ సర్వే చేసిందని..ఆ సర్వే రిపోర్టును కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్దే పెట్టుకున్నారని అన్నారు.