భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్ : మంత్రి కొండా సురేఖ

భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్ : మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులోని ఎస్సెస్సార్ ఫంక్షన్ హాల్ లో సోమవారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ క్రాంతి, ఎంపీ రఘునందన్ రావు, టీజీఐఐసీ చైర్​పర్సన్​నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహాసినిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు. పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సభలోని వారంతా ఒక నిమిషం మౌనం పాటించారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూసమస్యల పరిష్కారం కోసం రైతులు యేళ్ల తరబడి ప్రభుత్వ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగారన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చట్టాలు మారుతున్నాయి తప్ప రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పటికీ రూ.3 కోట్ల భూ సంబంధిత కేసులు కోర్టులో మూలుగుతున్నాయన్నారు.

  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం సమర్థవంతంగా అమలైతే 90శాతం భూసమస్యలు పరిష్కారమవుతాయనన్నారు. భూభారతి చట్టంపై రైతులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. 63 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీ ప్రాంగణంలో రూ.63.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ. కోటితో నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ప్రారంభించారు. అంతకు ముందు హత్నూర తహసీల్దార్ ఆఫీసు వద్ద రెవెన్యూ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, ఆర్డీవో రవీందర్, తహసీల్దార్ ఫర్హీన్ షేక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల మంజూరు కోసం మంత్రికి వినతి

శివ్వంపేట: అభివృద్ధి పనుల మంజూరు కోసం జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, కరుణాకర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సొంత భవనం, ఓ అంబులెన్స్, 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయాలని కోరారు. మండలంలోని నవపేట్ లో భూ సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని  పరిష్కరించేందుకు చర్యలు  తీసుకోవాలన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఫస్ట్ శివ్వంపేట మండలాన్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతన్ పల్లి గ్రామంలో భూ సమస్యలు చాలా ఉన్నాయని, కుంటలను కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిని కలిసిన వారిలో గణేశ్, అరుణ్ కుమార్, షేక్ అలీ, ప్రబులింగం, శ్రీనివాస్, రాజు ఉన్నారు.