దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు : కొండా సురేఖ

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు : కొండా సురేఖ
  • పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండాసురేఖ

మక్తల్, వెలుగు : రాష్ట్రంలోని దేవాదాయ భూముల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత  ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, దేవుడి మాన్యాలపై ఎలాంటి  శ్రద్ధ చూపలేదని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్  పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. 

మంత్రికి కలెక్టర్  సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్పీ యోగేశ్​ గౌతం బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నల్లజానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత పాలకులు యాదాద్రి పేరుతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిని అసంపూర్తిగా వదిలేశారన్నారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదన్నారు. తమ ప్రభుత్వం ఆలయంలో వృద్దులు, పిల్లలు, వికలాంగులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పించామన్నారు. 

రాష్ట్రంలోని మిగిలిన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వృథాగా ఉన్న ఆలయ భూములను మహిళా సంఘాల సభ్యులకు లీజుకు ఇచ్చి సోలార్ ప్లాంట్లు, ఆయిల్ పామ్ సాగు చేపట్టి ఆ ఆదాయంతో ఆలయాలను డెవలప్​ చేస్తామని తెలిపారు. ఆలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృష్ణా పుష్కరాలకు అవసరమైన నిధులతో పాటు ఈ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

ఘనంగా రథోత్సవం..

పడమటి అంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ప్రాణేశచారి, అరవింద చారి ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి పిండి వంటలు, మట్టి కుండల్లో చేసిన నైవేద్యాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఏపీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.