ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలే: మంత్రి కొండా సురేఖ కంటతడి

ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలే:  మంత్రి కొండా సురేఖ కంటతడి

హైదరాబాద్: మీడియా ముందు మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ దుబ్బాక రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండా వేశారు. రఘునందన్ రావు సురేఖ మెడలో నూలు దండ వేయడంపై బీఆర్ఎస్ నేతలు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ఇష్యూపై ఇవాళ (సెప్టెంబర్ 30) ఆమె గాంధీభవన్‎లో మీడియాతో మాట్లాడుతూ.. మెడలో నూలు దండ వేస్తే చిల్లర కామెంట్లు చేస్తారా.. సోషల్ మీడియా కామెంట్లతో నిన్నటి నుండి ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలేదు. మహిళనని చూడకుండా పశువుల కంటే హీనంగా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ | అక్టోబర్ 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్వే.. ఒప్పుకుంటేనే ఫ్యామిలీ ఫోటో..

నీకు ఓ చెల్లి ఉంది కదా.. ఆమె జైలుకు వెళ్లినప్పుడు మేం ఇలాగే ట్రోల్ చేశామా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై ఫైర్ అయ్యారు. మహిళలంటే కేటీఆర్‎కు చులకని అని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను ఇలాగే అగౌరపరిస్తే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. కేటీఆర్ ఖబర్దార్ ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‎పై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బీఆర్ఎస్ నేతన్నలను అవమానించిందన్నారు. తెలంగాణ భవన్ ముందు పద్మశాలీ సోదరులు నిరసన తెలిపితే బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే.. బట్టలిప్పించి ఉరికిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అనుచిత కామెంట్లు పెట్టి తనను ఆవేదనకు గురిచేసిన బీఆర్ఎస్ కు నా శాపం తప్పకుండా తగులుతుందన్నారు.