- ఆ పార్టీది విభజించి పాలించే మనస్తత్వం
- మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి
- రాహుల్ ఇంటికెళ్తే ఆయన కులం, మతమేంటో చెప్తారని వ్యాఖ్య
- గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖిలో పాల్గొన్న మినిస్టర్
హైదరాబాద్, వెలుగు: కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. విభజించు, పాలించు అనేది ఆ పార్టీ మనస్తత్వమని నిప్పులు చెరిగారు. బుధవారం గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడిన తీరుపై మండిపడ్డారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల అవసరాల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడలేదని విమర్శించారు. ‘‘బీజేపీ నాయకులు రాహుల్ కులంపై ప్రశ్నిస్తున్నారు.. కులగణన ఫామ్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్తే.. రాహుల్ కులం ఏంటో ఆయనే చెప్తారు’’అని అన్నారు. గత పదేండ్లలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ వేదిక కూడా లేకుండేనని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు పాలన అందిస్తోందని చెప్పారు. ‘‘ఎన్నికల ముందు ప్రగతి భవన్ కంచెలు బద్ధలు కొడ్తామని చెప్పాం. అన్నట్టుగానే చేసి చూపాం.
ప్రగతి భవన్ ఉన్నచోట ఇప్పుడు ప్రజాపాలన సాగుతోంది”అని మంత్రి పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మంచి సంప్రదాయమని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. కలగణన అంశంపై ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణన.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం జరగడంలో తెలంగాణనే రోల్ మోడల్ అని చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత వచ్చిన నివేదిక ఆధారంగా ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన స్కాంలు వాళ్లకు కలలో కనిపిస్తుండవచ్చని, అందుకే వాటి గురించి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
తన కొడుకును కాపాడాలని ఓ తల్లి వేడుకోలు..
మతిస్థిమితం లేని తన కుమారుడిని ఆదుకోవాలని యూసఫ్ గూడకు చెందిన ప్రీతి అనే మహిళ మంత్రిని వేడుకున్నారు. ఇండ్లల్లో పనిచేసి ఇద్దరు పిల్లలను పోషించడం కష్టంగా మారిందని, మతిస్థిమితం లేని బాబు వైద్యం కోసం ప్రతినెలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి.. బాబుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముఖాముఖికి 130 అర్జీలు..
ముఖాముఖిలో మంత్రి సురేఖకు వివిధ సమస్యలపై మొత్తం 130 అర్జీలు వచ్చాయి. ఇందులో వివిధ శాఖలకు చెందినవి 63, ఆరు గ్యారంటీలకు సంబంధించినవి 30, ఇతర దరఖాస్తులు 37 ఉన్నాయి. ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, అటవీ భూములు, వైద్య, ఉద్యోగ, ఉపాధి, భూ సమస్యలపై ఎక్కువగా వినతిపత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని సమస్యలపై మంత్రి అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు.