కేటీఆర్ దద్దమ్మలా మాట్లాడుతున్నడు: మంత్రి కొండా సురేఖ

  • బీఆర్ఎస్  సోషల్  మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు

సిద్దిపేట రూరల్, వెలుగు: మాజీ మంత్రి కేటీఆర్  దద్దమ్మలా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకొని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఫైరయ్యారు. శనివారం సిద్దిపేట అర్బన్  మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో రూ.1.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వంటి హేమాహేమీలు ఉన్న జిల్లాకు నన్ను ఇన్​చార్జి మంత్రిగా వేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు భయపడ్డానని, కానీ, ఈ జిల్లాకు వచ్చిన తరువాత కాంగ్రెస్  పార్టీ పట్ల ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. తాము అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేశామని చెప్పారు.

ఎక్కడో ఒకచోట టెక్నికల్  ప్రాబ్లం వల్ల రుణమాఫీ కాకపోతే, వారిని పట్టుకొని తమ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని విమర్శించారు. తాము బీఆర్ఎస్  ప్రభుత్వం మాదిరిగా ఏకపక్ష ధోరణితో వెళ్లమని, ప్రజలకు న్యాయం చేసేందుకే మెగ్గు చూపుతామన్నారు. అనంతరం రంగనాయక సాగర్  నుంచి కాలువల ద్వారా పంట పొలాలకు నీటిని వదిలారు. పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.