చిలుకూరు రంగరాజన్కు మంత్రి కొండా సురేఖ పరామర్శ

చిలుకూరు రంగరాజన్కు మంత్రి కొండా సురేఖ పరామర్శ

మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ తండ్రి సౌందర రాజన్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా వెళ్లి పరామర్శించారు. 

ఆయనకు ధైర్యం చెప్పారు. శుక్రవారం ఉదయం చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగ రాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు ఇబ్బంది పెట్టారని, రామ రాజ్యం స్థాపనకు సహకరించాలని దాడికి పాల్పడ్డారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

రంగరాజన్పై దాడికి పాల్పడిన నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కొండా సురేఖ చెప్పారు. దాడికి పాల్పడ్డ నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందని, రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రభుత్వం ఊరుకునేది లేదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

అసలేం జరిగింది..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​ రంగరాజన్పై దాడి జరిగింది. శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికి వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్కు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరారు. దానికి రంగరాజన్​ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్  కుమారుడిని కూడా కొట్టినట్టు సమాచారం.

తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించారు. ఊరికే కోర్టులో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు.

కాగా.. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్  ఎంవీ సౌందర్ రాజన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందిస్తూ.. తనపై 20 మంది దాడి చేశారని, పోలీసులకు కంప్లయింట్​ చేశానని చెప్పారు.

ఈ దాడిలో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డిని మొయినాబాద్  పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. దాదాపు 28 మందితో గుంపుగా వీరరాఘవ రెడ్డి.. రంగరాజన్​ఇంటికి వెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం.