ఆస్పత్రిని చెత్తగా మార్చిన్రు : కొండా సురేఖ

ఆస్పత్రిని చెత్తగా మార్చిన్రు : కొండా సురేఖ
  •     గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వ వైఫల్యంవల్లే ఈ దుస్థితి 
  •     ఆకస్మిక తనిఖీలో మంత్రి కొండా సురేఖ

వరంగల్​/ వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్​ప్రాంతీయ కంటి ఆస్పత్రి చెత్తగా మారిందని, గత బీఆర్​ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. సోమవారం మంత్రి సురేఖ, వరంగల్‍ కలెక్టర్‍ సత్య శారదా దేవితో కలిసి ఐ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి, అక్కడ ఒకే పేషెంట్‍ అడ్మిట్ అయ్యి ఉండటంతో వారు విస్మయం చెందారు. ఆపై మంత్రి రికార్డులు పరిశీలించారు. డ్యూటీ చేయాల్సిన డాక్టర్‍, ఇద్దరు సిబ్బంది అక్కడ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‍ను ఆదేశించారు. ఆస్పత్రి మొదటి అంతస్తు మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రాంగణమంతా కంకర తేలిన రోడ్లు, గుంతల్లో నీరు ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ఫుడ్​ అసలు బాగాలేదని, ఇందిరా మహిళా శక్తికి క్యాంటీన్‍ కి అప్పగించాలని కలెక్టర్‍కు చెప్పారు. ఆస్పత్రిలో కంప్లైంట్​ బాక్స్​ ఏర్పాటు చేయాలన్నారు. కావాల్సిన మరమ్మతులు, పేయింట్‍ వేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూపరింటెండెంట్‍ భరత్‍కుమార్‍కు తెలిపారు.

ఆస్పత్రిలో ఐ బ్యాంక్ నిర్మాణం జరిగి పదేళ్లు దాటుతున్నా సేవలు లేకపోవడమేంటని ప్రశ్నించారు. విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా, వరంగల్ దేశాయిపేట సమీపంలో జర్నలిస్టుల పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన జర్నలిస్టులతోపాటు ఇతరులకు కేటాయిస్తామని మంత్రి అన్నారు.