తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్‎దే పవర్: మంత్రి కొండా సురేఖ

తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్‎దే పవర్: మంత్రి కొండా సురేఖ

వరంగల్: తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు. శనివారం (ఏప్రిల్5) వరంగల్‎లోని గోవిందరాజుల గుట్ట వద్ద మంత్రి కొండా సురేఖ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. 

సన్న బియ్యం పంపిణీని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సన్న బియ్యం పంపిణీ ఆగదని స్పష్టం చేశారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. వరి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని.. విదేశాలకు కూడా బియ్యం ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు లాభం చేసే విధంగా పని చేసిందని విమర్శించారు. 

Also Read:-సన్న బియ్యం పంపిణీ పథకం కాదు.. పేదలకు వరం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళు, నిధులు, నియమాకాల కోసమని.. కానీ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందని.. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే లక్షకోట్లు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించాడని.. అందుకే అది నాలుగేళ్లకే కుంగిపోయిందని విమర్శించారు.