
సంగారెడ్డి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే అందరూ బానిసలుగా బతకాల్సి వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి పీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువులు, వైద్యం కనిపించవని విమర్శించారు. ఆదాని, అంబానీలకు ఏం కావాలో మాత్రమే మోదీకి తెలుసన్నారు.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న టైంలోనే అనేక కంపెనీలు ఏర్పాటు చేసి, వేలాది మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఐటీ రంగానికి బీజం పడిందని, మహిళా రిజర్వేషన్లు బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు. 25 ఏళ్లుగా వెనుకబాటుకు గురైన మెదక్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు, ఎంపీ క్యాండిడేట్ నీలం మధు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు.