యాదగిరిగుట్ట పునర్నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ వసతుల కల్పనపై పెట్టలే : మంత్రి కొండా సురేఖ

యాదగిరిగుట్ట పునర్నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ వసతుల కల్పనపై పెట్టలే : మంత్రి కొండా సురేఖ
  • కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఎన్నో సౌకర్యాలు కల్పించినం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం పేరుతో సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. కొండపైన కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదని మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని కుటంబసమేతంగా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన కనీసం టాయిలెట్స్, వాష్‌‌‌‌రూమ్స్‌‌‌‌ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఆలయ అభివృద్ధి పేరుతో దుకాణదారులు, ఆటో కార్మికులను రోడ్డున పడేయడమే కాకుండా.. ఇండ్లు, షాపులు కోల్పోయిన వారికి న్యాయం చేయకుండా ఆగం చేశారన్నారు.
 
 ఆలయ పునర్నిర్మాణంపై శ్రద్ధ పెట్టిన కేసీఆర్‌‌‌‌.. వసతులు కల్పించడంపై పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కొండపై వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు. భక్తులు సేద తీరడం కోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలో జర్మన్‌‌‌‌ హ్యాంగర్‌‌‌‌ షెడ్లు , వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లుల కోసం బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. 
 
భక్తుల సౌకర్యార్థం ప్రసాద విక్రయ కేంద్రాల సంఖ్యను పెంచామని, కార్తీక మాసంలో కొండ కింద వ్రత మండపం వద్ద కూడా ప్రత్యేక ప్రసాద విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొండపైన శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. భవిష్యత్‌‌‌‌లో  భక్తులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.