వరంగల్ జైల్, సెక్రటేరియెట్​లను కమీషన్ల కోసమే కూలగొట్టిన్రు : కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే వరంగల్ సెంట్రల్ జైల్ ను, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ను కూలగొట్టి వాటి స్థానంలో కొత్త బిల్డింగులు కట్టిందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా ఆమె శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్యతో సమావేశమై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణ ఖర్చును పెంచి కమీషన్ల తీసుకునేలా కేసీఆర్ కుటుంబం కుట్ర చేసిందన్నారు. దవాఖాన రూ.1,116 కోట్ల వ్యయాన్ని రూ.3,779 కోట్లుగా చూపడం, ఇతర తప్పుడు లెక్కలపై తమ ప్రభుత్వం కచ్చితంగా విచారణ చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్‍ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే.. బీఆర్ఎస్ నేతలు తప్పించుకోవడానికే ఉల్టా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‍ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వాటిని ఎలా అమలు చేయాలో తమకు తెలుసన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హామీలను విస్మరించింది కాబట్టే జనాలు వారిని పక్కనపెట్టారని చెప్పారు. తాము మాత్రం ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరను మంత్రులుగా సీతక్క, తాను కలిసి గ్రాండ్‍ సక్సెస్‍ చేస్తామన్నారు. వరంగల్‍ నగరాన్ని పైలట్‍ ప్రాజెక్ట్ కింద తీసుకుని అన్నివిధాలా డెవలప్‍ చేస్తామన్నారు.