బీజేపీ, బీఆర్‍ఎస్‍ ఒక్కటి కాకుంటే.. కాంగ్రెస్‍ మరో మూడు సీట్లు గెలిచేది:మంత్రి కొండా సురేఖ

  • రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించలేదు: మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు:పార్లమెంట్‍ ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍, బీజేపీ తెరవెనుక కలిసి పనిచేయకుంటే..కాంగ్రెస్‍ పార్టీ మరో మూడు పార్లమెంట్​ సీట్లు గెలిచేదని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అయినా, తాను ఇన్​చార్జీగా ఉన్న మెదక్‍ నియోజకవర్గంలో కొద్ది ఓట్ల తేడాతోనే ఓడిపోయినట్లు చెప్పారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్య విజయం సాధించిన నేపథ్యంలో.. శుక్రవారం పార్లమెంట్‍ వరంగల్‍ ఇన్​చార్జి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి అధ్యక్షతన హనుమకొండ కాంగ్రెస్‍ భవన్​లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు.

మంత్రి సురేఖ మాట్లాడుతూ..సీఎం రేవంత్‍రెడ్డి లోక్‍సభ ఎన్నికలను రెఫరెండంగా తీసుకున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్లామన్నారు. వరంగల్​లో కడియం శ్రీహరిపై ఉన్న గౌరవమే కావ్యకు ఎన్నికల్లో కలిసి వచ్చిందని.. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‍ పార్టీలోకి కొత్తగా వచ్చారనే ఆలోచన లేకుండా కేడర్‍ పనిచేసిందన్నారు. సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ను రెండో రాజధానిగా చూస్తున్నారని, ఎంపీగా కడియం కావ్య పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించలేదని.. తుది నిర్ణయం తీసుకోవడానికి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

కాంగ్రెస్‍ ఊరుకోదు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‍డీ ఏ కూటమి రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం చేసి నా.. మైనార్టీల జోలికొచ్చినా కాంగ్రెస్‍ ఊరుకోదని స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొందరు సన్నాసులు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడారని..ఆ మాటలను జనాలు పట్టించుకోలేదన్నారు. దేశంలో మోదీ ఛరిష్మా తగ్గిందని.. కాంగ్రెస్‍, ఇండియా కూటమి సీట్లు, ఓట్లు పెరిగాయన్నారు.

రాబోయే రోజులు కాంగ్రెస్‍ పార్టీవైతే.. కాబోయే ప్రధాని రాహుల్‍గాంధీ అన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మాస్టర్‍ప్లాన్‍ అమలు, ఓఆర్‍ఆర్‍, మామునూర్‍ ఎయిర్‍పోర్ట్, వరంగల్, హైదరాబాద్​ఇండస్ట్రియల్ ​కారిడార్, కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్‍, ఉపాధి, ఇండస్ట్రీస్‍ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తన తండ్రి పేరుకు మచ్చ రాకుండా పని చేస్తాననన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, కాంగ్రెస్‍ పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నేతలు ఈవీ.శ్రీనివాస్‍, కె. రవళి పాల్గొన్నారు.