హైదరాబాద్, వెలుగు: రూ.లక్షలు పెట్టి వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఓ కుటుంబానికి మంత్రి కొండా సురేఖ అండగా నిలిచారు. హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసిమ్, హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఆదిల్ హైమాద్ కొంత కాలంగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. బుధవారం బాధితులు అసెంబ్లీ వద్ద మంత్రిని కలిసి వారి బాధను విన్నవించారు.
చలించిపోయిన మంత్రి కొండా సురేఖ.. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంటనే స్పందించి.. బాధితులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సురేఖ అన్నారు.
ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. పేదలకు మన ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు.