-
అక్కా.. అని రఘునందన్ రావు మెడలో నూలు దండ వేస్తే ట్రోలింగ్ చేస్తవా?
-
నీ చెల్లె జైలుకెళ్తే ఇట్లనే ట్రోలింగ్ చేసినమా?
-
నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేసినవ్
-
రెండ్రోజుల నుంచి అన్నం తినలే.. మీడియా సమావేశంలో కంటతడి
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మొదట్నుంచి మహిళలను దారుణంగా అవమానిస్తున్నాడని, పశువుల కంటే హీనంగా చూస్తున్నాడని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. మంత్రి హోదాలో ఉన్న తననే ఇంట్లో ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. చేనేత సమస్యలు చెప్పి.. గౌరవంగా చేనేత మాల మెడలో వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ దాన్ని ట్రోల్ చేస్తున్నదన్నారు. ఒక మహిళా అనే గౌరవం లేకుండా అసభ్యకరమైన కామెంట్లతో మానసికంగా వేధిస్తున్నదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నువ్వు సోషల్ మీడియాలో పెట్టిస్తున్న పోస్టులతో మంత్రి హోదాలో ఉన్న నేనే బాధతో రెండ్రోజులుగా అన్నం తినలేదు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తావు. నీ బట్టలు విప్పించి ఉరికించే కార్యక్రమం దగ్గరలోనే ఉన్నది. మా పార్టీ కార్యకర్తలే ఆ బాధ్యత తీస్కుంటరు.. కేటీఆర్ ఖబడ్దార్..’’అని కొండా సురేఖ హెచ్చరించారు.
గాంధీభవన్‌లో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మూడు రోజుల కింద ఇన్చార్జ్ మంత్రి హోదాలో దుబ్బాకలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి వెళ్లిన. ఎంపీ హోదాలో రఘునందన్ రావు కార్మికుల సమస్యలు నాకు వివరించారు. జాతీయ జెండా రంగును పోలిన నూలు పోగు దండను నా మెడలో వేశారు. ‘‘అక్కా.. ఇది చేనేత కార్మికుల సమస్యల మాలా’’అని అన్నరు. ఆ మాలను నేను అలాగే చూస్తూ ఉన్న. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన కామెంట్లు పెట్టిస్తావా? ఓ మహిళా మంత్రిని ఇంతలా కించపరుస్తావా?’’అని కేటీఆర్‌పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు.
అధికారం పోయిందని పిచ్చెక్కిందా?
పదేండ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు సంస్కారం లేదని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నరని, ఏమైనా సాయం చేయండని కోరితే.. ‘‘సమాజం కోసం కన్నావా?’’ అంటూ ఓ మహిళను కేటీఆర్ అవమానించిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను అవమానించిన్రు. అందుకే ఆ పార్టీ నుండి బయటికొచ్చిన. బలుపు మాటలు ఇప్పటికైనా తగ్గించుకో. అధికారం పోయిందని పిచ్చెక్కి మహిళలను కించపరుస్తున్నవ్.
ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపు. అంతేగానీ.. మహిళలను మానసిక వేదనకు గురి చేస్తే వాళ్లే నీ బట్టలు ఇప్పించి ఉరికిస్తరు’’అని మంత్రి సురేఖ ఫైర్ అయ్యారు. అక్కా.. అని రఘునందన్ రావు మెడలో నూలు పోగు దండ వేస్తే అన్నా.. చెల్లెల బంధాన్ని కేటీఆర్ అవమానించారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ భార్యలు, కవితను ఒక్కటే అడుగుతున్న.. మహిళను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం కరెక్టేనా? గతంలో గవర్నర్ తమిళిసైని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవమానించిండు. మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కనూ వదల్లేదు. సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసిన. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన. స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్త. రఘునందన్ రావు నాకు ఫోన్ చేసి ‘‘అక్కా.. నన్ను క్షమించు. ఇంత నీచంగా ట్రోల్ చేస్తారని అనుకోలేదు’’అని బాధపడ్డడు’’అని మంత్రి సురేశ్ అన్నారు. బతుకమ్మ పండుగను చెడగొట్టిందే కవిత అని విమర్శించారు. బతుకమ్మ పేరు మీద డిస్కో డ్యాన్స్‌లు నేర్పిందని ఫైర్ అయ్యారు.
నువ్వు బట్టలిప్పి రోడ్డుపై తిరుగుతవా?
ట్రోలింగ్‌ను ఖండిస్తూ చేనేత కార్మికులు కొందరు తెలంగాణ భవన్ ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే.. బీఆర్ఎస్ గూండాలతో వాళ్లపై కేటీఆర్ దాడి చేయించాడని మంత్రి సురేఖ మండిపడ్డారు. ‘‘కేటీఆర్.. నీకు సిగ్గు ఉంటే బట్టలు లేకుండా బయట తిరుగు. అప్పుడు నీకు నూలు విలువ తెలుస్తది. ఇక నుంచి ట్రోలింగ్ చేస్తే ఊరుకోం. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే.. నిన్ను బట్టలిప్పించి ఉరికిస్తం’’అని మంత్రి సురేఖ ఫైర్ అయ్యారు.
సిరిసిల్లలో చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి ఆ వర్గానే కించపరుస్తావా? అంటూ మండిపడ్డారు. ‘‘నూలు దారంతోనే బట్టలు తయారవుతాయి. వాటితోనే సమాజంలో మనమందరం గౌరవంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నం. ఉన్నత వర్గం అనే బలుపుతో ఇలా వ్యవహరిస్తున్నావు. నాకు జరిగిన అవమానాన్ని వ్యతిరేకిస్తూ బీసీలంతా ఒక్కటై తిరగబడితే.. మీకు ఒక్క ఓటు కూడా రాదు. నీకూ... ఓ చెల్లి ఉంది కదా.. ఆమె జైలుకు వెళ్లినప్పుడు మేం ఇలాగే ట్రోల్ చేశామా? మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్స్ చేస్తున్నారని అవమానించినవ్. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఒక్కటే ప్రశ్నిస్తున్న.. మీ ఇంట్లో కూడా ఆడోళ్లు ఉన్నరు కదా.. వాళ్లను కూడా ఇలాగే ట్రోల్ చేస్తే ఎట్ల ఉంటది?’’అని మంత్రి సురేఖ ప్రశ్నించారు.