సంక్షేమ పథకాలకు రేషన్​కార్డే ప్రామాణికం : కొండా సురేఖ

  • మంత్రి కొండా సురేఖ

దుబ్బాక, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్​కార్డే ప్రామాణికమని మంత్రి కొండా సురేఖ అన్నారు.  అర్హులందరికీ రేషన్​కార్డులు పంపిణీ చేస్తామన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఒక్క రేషన్​ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలుకు శక్తి వంచన లేకుండా పని చేస్తోందన్నారు.

 ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసిందన్నారు.  ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసిన వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద రూ. 12 వేలను కూలీల బ్యాంక్​ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.

 వ్యవసాయానికి పనికి రాని రాళ్లు, రప్పలు, రోడ్లు, రియలేస్టేట్​ ప్లాట్లకు రైతు భరోసా ఇవ్వడం లేదని, సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా వర్తిస్తుందని తెలిపారు. మల్లన్న సాగర్​ప్రాజెక్ట్​ ద్వారా జిల్లాలోని ప్రతి చెరువు, కుంటలను నీటితో నింపి పంటలకు సాగు నీరందిస్తామన్నారు. అక్భర్​పేట భూంపల్లి మండల కేంద్రంలో రూ. కోటి 50 లక్షలతో పీహెచ్​సీని ఆప్​ గ్రేడ్​ చేశామని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీలోని18వ వార్డులో రూ. 40 లక్షలతో నిర్మించిన చిల్ర్డన్​ ఫార్క్​ను ప్రజలకు అంకితం చేశామని, రూ. 70 లక్షలతో మురుగు నీటి శుద్ధికరణ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని 309 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ పంపిణీ చేశారు.  

ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తాం

తొగుట, దౌల్తాబాద్: జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డి పేట్ వద్ద నిర్మించిన దుబ్బాక కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని 35 వేల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 

అంతకుముందు దౌల్తాబాద్ మండలంలో రూ.కోటి 54 లక్షలలతో నిర్మించిన ఆదర్శ పాఠశాల వసతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్, అధికారులు
 పాల్గొన్నారు. 

కాన్వాయ్​ని అడ్డుకున్న బీఆర్ఎస్​ లీడర్​

దుబ్బాక పట్టణంలో చిల్ర్డన్​ పార్క్​ను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ కాన్వాయ్​కు బీఆర్ఎస్ ​లీడర్​పడాల నరేశ్​ కారును అడ్డుగా పెట్టడడంతో అక్కడే ఉన్న సీఐ శ్రీనివాస్​ నరేశ్​ను కొట్టాడు. ఇది గమనించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి తమ కార్యకర్తను ఎలా కొడతావని సీఐని నిలదీయగా కాన్వాయ్​కి కారును అడ్డంగా పెట్టడడంతోనే కొట్టానని సమాధానం చెప్పారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు భూంపల్లిలో మంత్రి కాన్వాయ్​ను బీఆర్ఎస్​ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి కాన్వాయ్​ వెళ్లిపోయిన తర్వాత రోడ్డుపై బైఠాయించారు.