క్రికెటర్ విరాట్ కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్డు : మంత్రి కొండా సురేఖ‌‌‌‌  

క్రికెటర్ విరాట్ కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్డు : మంత్రి కొండా సురేఖ‌‌‌‌  
  • ఆయన 14 వేల రన్స్ చేసి రికార్డు సృష్టిస్తే.. ఈయన 
  • 14 నెలలుగా విరాట పర్వం వీడడం లేదు: మంత్రి కొండా సురేఖ‌‌‌‌  

హైదరాబాద్, వెలుగు: క్రికెటర్ విరాట్​ కోహ్లీ రికార్డుకు బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ రికార్డును ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆసక్తికర ట్వీట్​ చేశారు. దుబాయ్ వేదికగా పాకిస్తాన్​తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో టీమిండియా విజయం సాధించడం హర్షనీయమని పేర్కొన్నారు. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినమని చెప్పారు.

14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొడితే, మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలపై ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడా దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అని ఎద్దేవా చేశారు. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే.. 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అని పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు కట్టుబడి ఉన్నం

వన్యప్రాణుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని  మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆమె అధ్యక్షతన సోమ‌‌‌‌వారం సెక్రటేరియెట్​లో 8వ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు(ఎస్బీడబ్ల్యూఎల్​) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వన్యప్రాణుల‌‌‌‌ సంరక్షణ, అటవీ, పర్యావరణ పరిరక్షణ, ప‌‌‌‌లు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అటవీ, జీవవైవిధ్య నిర్వహణ మెరుగుపరిచే దిశగా నిపుణుల సూచనలను ఆమె స్వాగతించారు.

జాతీయ వన్యప్రాణుల సంర‌‌‌‌క్షణ మండలి (ఎన్బీడబ్ల్యూఎల్) సమీక్షకు పంపిన ప‌‌‌‌లు  ప్రాజెక్టులపై ఆరా తీశారు. 1972 వన్యప్రాణుల‌‌‌‌ సంరక్షణ చట్టం ప్రకారం రాష్ట్ర వన్యప్రాణుల సంర‌‌‌‌క్షణ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులు వివరించారు. పోచారం వన్యప్రాణుల‌‌‌‌ అభయారణ్యం నుంచి వెళ్లే మెదక్- ఎల్లారెడ్డి రహదారి విస్తరణకు, ములుగులో 11 కేవీ విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మాణం, నాగార్జునసాగర్ డివిజన్‌‌‌‌లో పెద్దగట్టు ఎత్తిపోతల పథకానికి అనుమతులిచ్చారు.

అటవీ ప్రాంతాల్లో ఓఎఫ్​సీ  లైన్ల ఏర్పాటు,  యానిమ‌‌‌‌ల్ పాసేజ్‌‌‌‌ల‌‌‌‌ మార్పుల కోసం 18 ప్రతిపాదనలు, మొబైల్ టవర్ల కోసం 13 ప్రతిపాదనలు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌ల‌‌‌‌ నుంచి 1,088 కుటుంబాల పునరావాసంపై అధికారుల అడిగి తెలుసుకున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌‌‌‌లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తేవేసే అంశాల‌‌‌‌ను పరిశీలించాలన్నారు.