- భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి కొండా సురేఖ
- సెక్రటేరియెట్ లో మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నంతో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం చేపట్టే పనులు మరో వందేండ్ల వరకు చెక్కుచెదరకుండా చేపట్టాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఆలయాల నిర్వహణ విషయంలో ఆగమ శాస్త్రాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో.. భక్తులకు సౌకర్యాల కల్పనకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గురువారం సెక్రటేరియెట్‌లో వేములవాడ, భద్రాచలం, బాసర టెంపుల్స్ డెవలప్ మెంట్, భక్తులకు అందుతున్న వసతులపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ రివ్యూ చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు వేములవాడ దేవాలయ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి పనులు మరో దశలో చేపట్టే పనులకు కొనసాగింపుగా ఉండేలా కార్యాచరణతో చేపట్టాలని సూచించారు. వేములవాడ దేవాలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గంగా జమున తెహజీబ్‌ను ప్రతిబింబించేలా వేములవాడ దేవాలయంలోని దర్గా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భద్రాచలంలో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలి : పొంగులేటి
భద్రాచలం ఆలయ విస్తరణకు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శాస్త్ర నియమాలను తప్పకుండా.. సహజంగా దేవాలయ విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. కల్యాణ మండపానికి అనుబంధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో మండపాన్ని నిర్మించాలన్నారు. దేవాలయ విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.
త్వరలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి ఆలయాన్ని సందర్శించి కచ్చితమైన నిర్ణయానికి వస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం ఆయా ఆలయాల అర్చకులు.. మంత్రులు, ప్రభుత్వ విప్‌కు వేదాశ్వీరచనం అందించారు. తర్వాత దసరా పండుగను పురస్కరించుకుని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో నిర్వహించే శరన్నవరాత్రుల ఉత్సవాల పోస్టర్‌ను మంత్రులు, ప్రభుత్వ విప్ తదితరులు ఆవిష్కరించారు.
బాసరలో రాజగోపురాలను నాలుగుకు పెంచాలి..
బాసర దేవాలయంలో ప్రస్తుతమున్న రెండు రాజగోపురాలను నాలుగుకు పెంచాలని అధికారులకు మంత్రి సురేఖ సూచించారు. ప్రాకారం, గోపురాలు, గర్భగుడి పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సత్రాలు, వాటి పరిధిలోని గదులపై ఆరా తీశారు. పార్కింగ్, మూత్రశాలలు, క్యూలైన్లు తదితర అంశాల్లో ఆలసత్వం వహించొద్దని హెచ్చరించారు. నిర్మాణ పనులు చేసేటప్పుడు భక్తులకు ముందుగానే సమాచారమిచ్చి అసౌకర్యాన్ని నివారించాలని మంత్రి అధికారులకు సూచించారు.