తెలంగాణలోని మూడు సిటీల్లో తీవ్ర కాలుష్యం .. మంత్రి కొండా సురేఖకు వివరించిన పీసీబీ

తెలంగాణలోని మూడు సిటీల్లో తీవ్ర కాలుష్యం .. మంత్రి కొండా సురేఖకు వివరించిన పీసీబీ
  • దేశంలోని131 నాన్-అటైన్మెంట్ సిటీల లిస్టులో హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి
  • వెంటనే పొల్యూషన్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు సిటీల్లో కాలుష్యం తీవ్రంగా ఉందని పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు పొల్యూషన్​కంట్రోల్​బోర్డు(పీసీబీ) అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా 131 నాన్-అటైన్మెంట్ సిటీలను (కాలుష్య నగరాలు) గుర్తించగా.. ఆ లిస్టులో మన రాష్ట్రంలోని హైదరాబాద్​, నల్గొండ, సంగారెడ్డి ఉన్నాయని చెప్పారు. పీఎం10 స్థాయిలను 30 నుంచి 40 శాతానికి తగ్గించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు మంత్రికి వివరించారు.

 పీసీబీ అధికారులిచ్చిన సమాచారంపై మంత్రి సురేఖ శుక్రవారం రాష్ట్ర అధికారులతో సెక్రటేరియెట్​లో  సమీక్షా సమావేశం నిర్వహించారు. నేషనల్​క్లీన్​ఎయిర్ ప్రోగ్రామ్​(ఎన్​క్యాప్​)పై చర్చించారు. రాష్ట్రంలోని మూడు సిటీల్లో గాలి నాణ్యత క్షీణిస్తుండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​తో పాటు చుట్టుపక్కల బొగ్గును ఇంధనంగా వాడుకునే ఇండస్ట్రీలు ప్రత్యామ్నాయంగా గ్యాస్​ను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

కాలుష్య కారకాలను తగ్గించేందుకు ఎమిషన్​ మానిటరింగ్​ సిస్టమ్​ల ఏర్పాటు వంటి చర్యలను చేపట్టాలన్నారు. జనాభాతో పాటే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నదని తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా వాహనాల ఫిట్​నెస్​పై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్​ బస్సుల కొనుగోలు కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ.వంద కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు.

చెత్తా చెదారాన్ని కాల్చొద్దు

రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారాన్ని కాల్చేస్తున్నారని, దాని వల్ల గాలినాణ్యత పడిపోతున్నదని మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తీవ్రంగా తీసుకోవాలని అధికారులకు చెప్పారు. చెత్తను కాల్చకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, సీఎస్​ సారథ్యంలో స్టీరింగ్​ కమిటీ, పర్యావరణం, సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ కమిటీ, జిల్లా స్థాయిల్లో ఇంప్లిమెంటేషన్​ కమిటీలు పనిచేస్తున్నాయని మంత్రికి అధికారులు వివరించారు.