
- అడవుల విస్తరణ లేకపోవడంతో జీవవైవిధ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం
- ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: అడవులను పరిరక్షించకుండా నాశనం చేస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేబీఆర్ పార్కులో నిర్వహించిన అంతర్జాతీయ అటవీ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవాతో కలిసి మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అడవులను కాపాడితేనే జీవ వైవిధ్యం సాధ్యమవుతుందని చెప్పారు. వృక్ష సంరక్షణ అనేది మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు. తానూ చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అడవుల పరిరక్షణ, అవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏటా మార్చి 21వ తేదీని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారమని, జీవజాలానికి, వనాలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. క్రిస్టినా పిజ్కోవా మాట్లాడుతూ.. అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని, బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.