- కొత్త హాస్పిటల్ పేరుతో.. ఎంజీఎంను పట్టించుకోలే
- కోతుల వల్లే ఎంజీఎంలో షార్ట్‌సర్క్యూట్
- కొందరు డాక్టర్లు డబ్బుల కోసమే పనిచేస్తున్రు
- ఎంజీఎంలో 25 మందికి కరోనా ట్రీట్‍మెంట్
- హాస్పిటల్లో సౌకర్యాలపై త్వరలో హెల్త్మినిస్టర్తో మీటింగ్
- ఎంజీఎంలో రివ్యూ చేసిన మంత్రి కొండా సురేఖ
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వం హెల్త్‌సిటీలో కొత్త హాస్పిటల్ కడ్తున్నామనే పేరుతో ప్రస్తుతమున్న ఎంజీఎంలో సమస్యలను పట్టించుకోలేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వం ఎంజీఎం ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆదివారం మంత్రి సురేఖ..ఎంజీఎం హాస్పిటల్ అధికారులు, డాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడుతూ నాటి ప్రభుత్వం రూ.వందల కోట్ల సెంట్రల్ జైల్ స్థలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మస్తున్న విషయాన్ని కేఎంసీ, ఎంజీఎం అధికారులకు చెప్పలేదన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి 1000 బెడ్లు వస్తే ఎంజీఎంకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. శుక్రవారం కరెంట్ సరఫరాలో ఇబ్బందులపై మాట్లాడుతూ.. కోతుల వల్లే షార్ట్సర్క్యూట్జరిగిందన్నారు. అందుబాటులో ఉన్న 5 జనరేటర్లతో కరెంట్ అందించామన్నారు. కరోనా విషయమై మాట్లాడుతూ..ఈ నెల 21 నుంచి ఎంజీఎంలో 170 మందికి టెస్టులు చేయగా..25 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వారు బాగానే ఉన్నారన్నారు. ఎమర్జెన్సీలో 1200 బెడ్లు, 3 ఆక్సిజన్ ట్యాంకులు రెడీగా ఉంచామన్నారు.
కొందరు డాక్టర్లు డబ్బు కోసమే పని చేస్తున్నరు
ఎంజీఎం హాస్పిటల్లో కొందరు డాక్టర్లకు సేవ చేయా లనే ఆలోచన లేదని, డబ్బుల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రూరల్ ఏరియాలు, ఎంజీఎం వంటి హాస్పిటల్స్‌లో కంపల్సరీగా పనిచేస్తేనే డాక్టర్‍గా గుర్తించేలా యాక్ట్తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎంజీఎంలో డ్యూటీలు ఎగ్గొట్టే కొందరు తీరు మార్చుకోవాలన్నారు. జూనియర్లతో పేషెంట్లకు అనస్తీషియా ఇప్పించే ప్రయోగాలు మానుకోవాలని సూచించారు. డెయిలీ ఓపీలో వచ్చిన పేషెంట్లందరికి ట్రీట్‍మెంట్ ఇచ్చేవరకు డాక్టర్లు బయటకు పోవద్దన్నారు.
మంత్రికి సమస్యల హారం
ఎంజీఎంలో డాక్టర్లు, సిబ్బంది కొరత, పరికరాలు వం టి విషయంలో ఆఫీసర్లు గతంలో పెట్టిన ప్రపోజల్స్చూపుతూ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హాస్పిటల్లో గుండె డాక్టర్ల కొరత ఉందన్నారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ల కొరత, కరెంట్ పోయే సమయాల్లో డీజిల్, వాటర్ సమస్య.. సీటీ, ఎంఆర్‍ఐ స్కాన్లలో ఇబ్బందులు, ప్రభుత్వం ఫండ్స్ విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఆపిన పనులు, ఆపరేషన్ థియేటర్లు, మెడిసిన్ సప్లై అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలపై డిస్కస్ చేయడానికి హాస్పిటల్ డెవలప్‍మెంట్ కమిటీలను కూడా నియమించలేదన్నారు.
కరోనా జాగ్రత్తలతో ఐలోని మల్లన్న జాతర
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలతో ఐలోని మల్లన్న జాతర సక్సెస్ చేయాలని మంత్రి కొండా సురేఖ ఆఫీసర్లను ఆదేశించారు. ఈసారి మేడారం జాతర కూడా ఉన్న నేపథ్యంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలన్నారు. జనవరి 13 నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం ఆలయ ఆవరణలో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన రివ్యూ చేశారు. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సురేఖ మొదటిసారి ఆలయానికి రాగా.. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్నాగరాజు ఆలయంలో పూజలు నిర్వహించారు.
తర్వాత నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనాను దృష్టిలో పెట్టుకుని శానిటేషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు. పారిశుద్ధ్య లోపం కనిపిస్తే సీరియస్యాక్షన్ఉంటుందన్నారు. మెడికల్ ఆఫీసర్లు, వలంటీర్లు అందుబాటులో ఉండాలని, ఆలయ ప్రాంగణంలోనే మూడు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలన్నారు. మహిళలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు కుంటలకు ఫెన్సింగ్వేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.
ఆలయ పాలకమండలి విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాత కమిటీ గడువు ముగియకుంటే వారినే కొనసాగిస్తామని చెప్పారు. ఆలయ సమీపంలో బెల్టు షాపులు, వైన్స్ ఉండొద్దని, ఒకవేళ ఉంటే తొలగించాలని ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్నాగరాజు మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అడిషనల్కలెక్టర్ రాధిక గుప్తా, ఎండోమెంట్డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఆలయ ఈవో నాగేశ్వర్ రావు, జాతర ప్రత్యేక అధికారి, హనుమకొండ ఆర్డీవో ఎల్.రమేశ్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీసీపీ రవీందర్, ఏసీపీ సతీష్ బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేందర్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ మల్లేశం, ఎంపీపీ మధుమతి, సర్పంచ్ కుమారస్వామి పాల్గొన్నారు.
మీడియాను రానివ్వట్లేదంటే.. ఏదో తప్పు చేస్తున్నట్లే
ఎంజీఎంలో పేషెంట్ల సమస్యలు..సమస్యలను కవర్ చేయడానికి మీడియాను అనుమతించడంలేదనే విషయంపై మాట్లాడుతూ దవాఖానలో అధికారులు మీడియా కవరేజీని అడ్డుకున్నారంటే వారు ఏదో తప్పు చేస్తున్నట్లు..సేవల్లో ఏదో లోపం ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. సమస్యలను ఎత్తిచూపే అవకాశం మీడియాకు ఇవ్వాలన్నారు. హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు మందులు బయటకొనే పరిస్థితి ఉండొద్దన్నారు. శుక్రవారం విద్యుత్ సరఫరా లోపం ఘటన నేపథ్యంలో ఎంజీఎంను విజిట్చేశానని, త్వరలో హెల్త్మినిస్టర్తో రివ్యూ నిర్వహించి కావాల్సిన ప్రపోజల్స్పెట్టేలా చూస్తానని తెలిపారు.