వచ్చే బ్రహ్మోత్సవాల లోపు యాదాద్రిలో అభివృద్ధి పనులు పూర్తి : మంత్రి కొండా సురేఖ

వచ్చే బ్రహ్మోత్సవాల లోపు యాదాద్రిలో అభివృద్ధి పనులు పూర్తి : మంత్రి కొండా సురేఖ
  • పనులు పూర్తయ్యాక విమానగోపురానికి సీఎం మహా కుంభాభిషేకం: మంత్రి కొండా సురేఖ
  • సీఎం పర్యటన నేపథ్యంలోవైటీడీఏ పనులపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలోపు యాదాద్రిలో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత విమాన గోపురానికి సీఎం రేవంత్ రెడ్డి మహా కుంభాభిషేకం చేస్తారని.. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం సీఎం రేవంత్  రెడ్డి యాదాద్రిని సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) చేపట్టిన పనులపై సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో.. గురువారం సచివాలయంలో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వైటీడీఏ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వివరాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రికి వివరించారు. గాలి గోపురం విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి అందించే పరిహారం, ఇతర ప్రయోజనాలపై మంత్రి ఆరా తీశారు. వీరిలో 162 మందికి అందించనున్న షెట్టర్ల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ పనులు పూర్తిచేసి వాటిని లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. వైటీడీఏ కు కేటాయించిన మొత్తం బడ్జెట్, అందుబాటులో ఉన్న నిధులు, ఇప్పటికే నిర్ధారించి, పెండింగ్ పనులకు కావాల్సిన నిధులు తదితర వివరాలతో శుక్రవారం జరిగే సీఎం సమీక్షకు రావాలని వైటీడీఏ అధికారులకు మంత్రి సూచించారు. 

10 వేల చదరరపు అడుగుల బంగారం తాపడం విమాన గోపురం పనులకు గాను నేటి వరకు 1,600 చదరపు అడుగుల పని పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెల 15  నుంచి విమాన గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ప్రారంభమవుతాయన్నారు. బంగారు తాపడం నిమిత్తం 60 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ చార్జీలకు కలిపి మొత్తం రూ.8 కోట్లు వెచ్చిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్  హనుమంత్ కొండిబా, అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.