- మంత్రి కొండా సురేఖ
జనగామ, వెలుగు: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జనగామ శివారు యశ్వంతాపూర్‌లో టీఎన్జీఓస్ బిల్డింగ్ నిర్మాణానికి శుక్రవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఖిలా వరంగల్: నేటి సమాజంలో బాలికలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలావరంగల్‌లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షన్ శిబిరాన్ని కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా మహిళలపై దాడులు ఆగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
రూ.1.23 కోట్ల పనులకు శంకుస్థాపన
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్ పడమర కోటలో రూ.1.23 కోట్ల అభివృద్ధి పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు ఈనిధులతో చేపట్టనున్నారు.