నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా డెవలప్​ చేస్తాం : మంత్రి కొండా సురేఖ

నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా డెవలప్​ చేస్తాం : మంత్రి కొండా సురేఖ
  • మంత్రి కొండా సురేఖ
  • రాష్ట్రాన్ని దోచి పార్టీ అకౌంట్లను నింపారని బీఆర్ఎస్​పై ధ్వజం  

అచ్చంపేట, వెలుగు: నల్లమలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, టూరిజం అభివృద్ధికి ఫారెస్ట్  అడ్డంకులు తొలగించేందుకు శక్తి వంచన లేకుండా ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సోమవారం అచ్చంపేట మండలం ఉమామహేశ్వర ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. అంతకుముందు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భోగ మహేశ్వరంలో పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ గా బీరం మాధవరెడ్డితో పాటు పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచి ఆ పార్టీ ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. పదేండ్ల పాటు రాష్ట్రాన్ని కేసీఆర్  ప్రభుత్వం నాశనం చేసిందని, చెడగొట్టిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి బాగు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి బీఆర్ఎస్  పార్టీ అకౌంట్​లో రూ.1,500 కోట్లు జమ చేసుకున్నారని ఆరోపించారు. అంతకుముందు పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయాన్ని సందర్శించారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, శాట్  చైర్మన్  శివసేనారెడ్డి, ఆర్డీవో మాధవి, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.