హైదరాబాద్, వెలుగు: కాగజ్‌నగర్‌లోని ఈస్గాంలో పులి దాడిలో మోర్లే లక్ష్మి అనే యువతి చనిపోవడం బాధాకరం అని మంత్రి కొండా సురేఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే రూ.10 లక్షల పరిహారం అందజేశామన్నారు. వ్యవసాయ పనులు చేసేవారు, పశువులను మేతకు తీసుకుపోయేవారు జాగ్రత్తగా ఉండాలని, అటవీ శాఖ ఆఫీసర్ల సూచనలను పాటించాలన్నారు.
పులి జాడ కనిపించిన వెంటనే మిగతా వారిని అప్రమత్తం చేయడంతో పాటు ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సిర్పూర్ టి మండలం దుబ్బగూడెంలో సురేశ్ అనే రైతుపై పులి దాడి చేయడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్‌తో మాట్లాడి రైతు పరిస్థితిపై ఆరా తీశారు. పులి కదలికల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.