- ఇళ్లు లేనోళ్లకే మొదటి ప్రాధాన్యత
వరంగల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్ సౌకర్యాలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన వరంగల్, గ్రేటర్ వరంగల్ ఇందిరమ్మ నోడల్ ఆఫీసర్లు, కమిటీ సభ్యులతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఇళ్లు లేనోళ్లకే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మొదటి ప్రాధాన్యాత ఇవ్వాలన్నారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని ఆఫీసర్లు, కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ నెల 31 లోగా అర్హుల జాబితా అందించే సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రతి సర్వేయర్ రోజుకు 25 చొప్పున 15 రోజుల్లో 500 గృహాలను సర్వే చేసేలా మొత్తం 619 మంది సర్వేయర్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతోపాటు త్వరలోనే పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికతోపాటు ఇండ్ల నిర్మాణం ఏకకాలంలో కొనసాగించేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కేఆర్ నాగరాజు మాట్లాడుతూ నిజమైన పేదలకు ఇండ్లు అందించే క్రమంలో అధికారులకు సహకరిస్తామన్నారు. సమావేశంలో గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, నర్సంపేట మున్సిపల్ చైర్‍పర్సన్ గుంటి రజిత తదిరులు పాల్గొన్నారు.